‘ఛావా’ వసూళ్ల సునామీ.. ఐదు రోజుల్లోనే రఫ్ఫాడించాడు!

by | Feb 19, 2025 | సినిమా

బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ దీంట్లో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయ‌న భార్య యెసుబాయ్ పాత్ర‌ను ర‌ష్మిక మందన్నా పోషించారు. ఇక ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్ట్రాంగ్ థియేట్రికల్ రన్ ని కొనసాగిస్తున్న ఈ మూవీ అయిదో రోజు కూడా జోరు చూపించింది. ముఖ్యంగా నాలుగో రోజు కంటే అయిదవ రోజు రూ. 25.75 కోట్లు అధికంగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఛావా మూవీ మొత్తంగా తొలి అయిదు రోజుల్లో రూ.171.28 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి రూ. 200 కోట్ల మైలురాయికి మరింత చేరువైంది. బుధవారం శివాజీ మహరాజ్ జయంతి కావడంతో ఆరో రోజు భారీ ఎత్తున కలెక్షన్లు సాధించే అవకాశముంది.

ప్రస్తుతం ఇండియా వైడ్ అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో వీక్ డేస్ అయినా కూడా ఛావా జోరు కొనసాగుతోంది. ఈ రేంజ్‌లో ఛావా సత్తా చాటుతుండటంతో త్వరలోనే ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించగా.. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు.