టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) , క్రేజీ డైరెక్టర్ శివ నిర్వాణ (Siva Nirvana) కాంబినేషన్‌లో ‘ఇరుముడి’ (Irumudi) అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రవితేజ 77వ చిత్రంగా ఈ సినిమా తెరపైకి రానుంది. ఈ మూవీ టైటిల్‌తో పాటు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇప్పటివరకు చూడని కొత్త సినిమాటిక్ అనుభూతిని అందించేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కెరీర్ ఆరంభం నుంచి యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో అభిమానులను అలరించిన రవితేజ ఈసారి కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
నిజానికి ‘ఇరుముడి’ సినిమా కథ మొదటగా యువ హీరో అక్కినేని నాగచైతన్యకు (Naga Chaitanya) వినిపించారట దర్శకుడు శివ నిర్వాణ. ముఖ్యంగా కథలోని ప్రధాన పాయింట్ చైతూను బాగా ఆకట్టుకుందట. కానీ తన నిర్ణయం దర్శకుడికి చెప్పడంలో ఆలస్యం జరిగిందట. ఒక వైపు నాగచైతన్య నిర్ణయం చెప్పకపోవడం, మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) వెంటనే సినిమా మొదలుపెట్టాలని ఒత్తిడి చేయడంతో దర్శకుడు శివ నిర్వాణ ఈ కథను రవితేజ వద్దకు తీసుకెళ్లారట. ఈ కథ రవితేజకు బాగా నచ్చడంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో ‘ఇరుముడి’ సినిమా రవితేజ కథానాయకుడిగా ప్రారంభమైంది. ఒకవేళ నాగచైతన్య ఈ సినిమా కథ విన్న వెంటనే ఓకే చెప్పుంటే ‘ఇరుముడి’ సినిమా చైతూ ఖాతాలోకే వెళ్లుండేదనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. గతంలో శివ నిర్వాణ, నాగచైతన్య కాంబోలో వచ్చిన ‘మజిలీ’ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ, నాగచైతన్య కాంబో కొనసాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ కాంబో మరోసారి పట్టాలెక్కలేదు. మరి ‘ఇరుముడి: సినిమాను వదిలేసి నాగచైతన్య తప్పు చేశాడా లేదా అనేది తెలియాలంటే ‘ఇరుముడి’ చిత్రం విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. కాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ నటించనుండగా.. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

