‘SYG’కి ఊహించని షాక్.. సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

by | Feb 8, 2026 | సినిమా

మెగా మేనల్లుడు సాయిదుర్గతేజ్‌ (Sai Durga Tej) కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక పానిండియా పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా ‘SYG’ (సంబరాల యేటిగట్టు). ఐశ్వర్యలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రోహిత్‌ కె.పి తెరకెక్కిస్తున్నాడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి నిర్మాతలు భారీ బడ్జెట్‌తో చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. కానీ అనుకున్న దాని కంటే ఎక్కువగా బడ్జెట్‌ కావడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. లేదంటే గతేడాది దసరాకే ఈ చిత్రం విడుదల కావాల్సింది.

అయితే ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేశారట. కానీ తాజా టాక్ ప్రకారం వేసవిలో కూడా సినిమా విడుదల కావడం కష్టమే అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వట్లేదు మేకర్స్. ఇక ఈ సినిమా షూటింగ్‌ ఆసల్యం కావడంతో ఈ సినిమాను పక్కనపెట్టి కొత్త చిత్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘సేవ్ ది టైగ‌ర్స్‌’ (Save The Tigers) తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు తేజ కాకుమాను తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగానే.. సాయిదుర్గతేజ్‌, సిద్దు అనే కొత్త దర్శకుడుతో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఇలా సాయిదుర్గతేజ్‌ వరుసగా కొత్త సినిమాలను లైన్ లో పెట్టడం చూస్తుంటే ‘సంబరాల యేటిగట్టు’ (Sambarala Yeti Gattu) సినిమా ఇప్పట్లో లేనట్టే కనిపిస్తోంది.