‘యానిమల్‌’ సీక్వెల్‌.. క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌రెడ్డి

by | Feb 5, 2026 | సినిమా

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌ లీడ్ రోల్‌ పోషించిన మూవీ యానిమల్‌. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandana) , తృప్తి డిమ్రి ఫీ మేల్‌ లీడ్ రోల్స్‌లో నటించారు. 2023లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో ‘యానిమల్‌’కు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ (Animal Park) పేరుతో మరో చిత్రం రాబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన విషయం విదితమే. అయితే, ఈ సీక్వెల్‌ నిర్మాణానికి సంబంధించిన తాజా వార్త ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నది. తాజాగా దర్శకుడు సందీప్‌రెడ్డి (Sandeep Reddy Vanga) ఈ మూవీ సీక్వెల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఫిబ్రవరి 13న యానిమల్‌ సినిమా జపాన్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో రణ్‌బీర్‌ కపూర్‌, డైరెక్టర్ సందీప్‌ రెడ్డి ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్‌ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ‘యానిమల్‌ పార్క్‌’ మొదలెట్టానున్నామని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభిస్తామని, 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు.

అయితే ఈ మూవీ సీక్వెల్ లో రణ్‌బీర్‌ కపూర్ (Ranabir Kapoor) హీరో పాత్రలోనే కాకుండా విలన్‌గా కూడా నటించనున్నారని ప్రకటించారు. ప్రస్తుతం తాను ప్రభాస్ ‘స్పిరిట్‌’ (Spirit) మూవీ పనుల్లో బిజీగా ఉన్నానని, అది ముగియగానే ‘యానిమల్‌ పార్క్‌’ (Animal Park) మొదలవుతుందని సందీప్‌ రెడ్డి వెల్లడించారు. కాగా, తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా ఎదిగిన సందీప్ రెడ్డి వంగా, అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్‌, యానిమల్ సినిమాలతో బాక్సాఫీస్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.