తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ.84 కోట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మెగా మూవీ ఇప్పటి వరకూ 25రోజులు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ 25 రోజుల్లో రూ.375 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ మేరకు తాజాగా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన ఫస్ట్ వీక్ లోనే మన శంకర వరప్రసాద్ గారు రూ.292 కోట్లు కలెక్షన్లు వసూలు చేసింది. కేవలం మొదటి వారంలోనే ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన తొలి రీజనల్ మూవీగా ఆల్‌టైమ్ రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక ఇక్కడే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమా సుమారు రూ. 5 మిలియన్ల డాలర్లు వసూలు చేయి మెగాస్టార్ కెరీర్లోనే 5 మిలియన్ల డాలర్లు సాధించిన సినిమాగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) రికార్డు నెలకొల్పింది. అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్‌మైషోలో ఏకంగా 40 లక్షల టికెట్లు అమ్ముడవడం విశేషం. ఇదిలాఉంటే.. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న వారి కోసం అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 11 నుంచి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడతోపాటు మరాఠి, బెంగాలీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. కాగా, షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.

