Chiranjeevi Vs Bala Krishna – వచ్చే సంక్రాంతికి సమరమే!

by | Jan 30, 2026 | సినిమా

తెలుగు చిత్రసీమలో అత్యధిక సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన అగ్ర కథానాయకులు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటసింహ నందమూరి బాలకృష్ణ అనే చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద వీరిద్దరి చిత్రాలు నువ్వా నేనా అనే తరహాలో పోటీ పడితే చూడాలని అభిమానులే కాకుండా సినీ ప్రేమికులు కూడా కోరుకుంటారు. ఈ సంక్రాంతి బరిలో ఒకసారి చిరంజీవి గెలిస్తే, మరోసారి బాలకృష్ణ విజయం సాధించారు. చివరిసారి వీరిద్దరూ 2023లో పోటీపడ్డారు. ఆ ఏడాది బాలకృష్ణ (Bala Krishna) , గోపీచంద్ మలినేని కాంబోలో ‘వీరసింహారెడ్డి’ సినిమా వచ్చిన తదుపరి రోజునే చిరంజీవి- బాబీ కాంబోలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ విడుదలైంది. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా.. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి మరోసారి వీరిద్దరూ బ్యాక్సాఫీస్ వద్ద గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. అయితే ఈసారి చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ గ్యాంగ్‌స్టర్ బ్యాగ్డ్రాప్ చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ (Bobby) కొల్లి దర్శకత్వంలో ‘మెగా 158’ (Mega 158) వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని తెలిసింది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో చిరును పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్‌ తర్వాత హీరో బాలకృష్ణ (Bala Krishna), దర్శకుడు గోపీచంద్‌ మలినేని (Gopi Chand Malineni) కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘ఎన్‌బీకే 111’ (NBK111) వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కించబోతున్న ఈ సినిమా కథను ముంబై మాఫియా నేపథ్యంలో పవర్‌ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తయారుచేశారట. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.