టాలీవుడ్‌లో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. ఇటీవలే కరుణకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన మట్కా మూవీకి బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీతో తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మేర్లపాక. ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇండో-కొరియన్ హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. మేర్లపాక గాంధీ ఇందులో వరుణ్‌తేజ్ (Varun Tej) కోసం అద్భుతమైన స్క్రిప్ట్ తయారు చేశారని, ఈ ప్రాజెక్ట్‌లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో వరుణ్ కనిపించనున్నారని అంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మార్చి చివర్లో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో అగ్ర భాగం కొరియా, వియాత్నంలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ ఫేమ్ రితికా నాయక్ నటించనుంది. ఇక ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ తో పాటుగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నారు.

