మెగా హీరో మూవీలో విలన్‌గా సంజయ్‌దత్‌!

by | Feb 27, 2025 | సినిమా

మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌, యువ కథానాయిక ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని హనుమాన్ మేకర్స్‌ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. దాదాపు వందకోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా వస్తోంది.
ఆర్కాడీ అనే ఊహాత్మక ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్‌ డ్రామాలో సాయిదుర్గతేజ్‌ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని, చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్ లో శరవేగంగా జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ సంజయ్‌దత్‌ నటించనున్నారని తెలుస్తోంది. ఇటీవలే రోహిత్‌ కేపీ ఆయన్ని కలిసి స్క్రిప్ట్ గురించి వివరించారని.. స్క్రిప్ట్ తో పాటుగా తన పాత్రను డిజైన్ చేసిన తీరుకు ఫిదా అయిన సంజయ్‌దత్‌ వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే ఇప్పటికే సంజయ్‌దత్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో విలన్ గా నటించగా.. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’లో బాలయ్య ‘అఖండ-2’ మూవీలో కూడా కీలక పాత్రల్లో నటించనున్నాడు. కాగా, ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్‌, సాయికుమార్‌, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తుండగా.. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.