ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యువ దర్శకుడు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం మహేశ్‌బాబు.పి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా టైటిల్‌ని ఖరారు చేయని ఈ చిత్రంలో ‘సాగర్’ అనే పాత్రలో రామ్ కనిపించనున్నారు. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్న రామ్ పూర్తి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భాగ్యశ్రీబోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం రెండో షెడ్యూల్ కోసం రాజమండ్రికి వెళ్ళింది. అక్కడ పరిసర ప్రాంతాల్లో మొత్తం 34 రోజులు పాటు చిత్రీకరణ జరిగింది.
ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటుగా రెండు సాంగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్, షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్లతో పాటుగా సీనియర్ ఆర్టిస్టులు రావు రమేష్, మురళీ శర్మ సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ పాల్గొన్నారు. మార్చి 28 నుంచి హైద్రాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండగా ఇందులో క్లైమాక్స్ తో పాటుగా ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. కాగా, మేరిక్రిస్మస్, మలైకొట్టై వాలిబన్ ఫేం సినిమాటోగ్రఫర్ మధు నీలకందన్ ఈ సినిమాకు పని చేస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. నేషనల్ అవార్డు విన్నింగ్ టెక్నీషియన్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

