నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. పెద్దగా కమర్షియల్ అంశాల్లేకుండా కంటెంట్ కి కట్టుబడి తీసిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొస్తోంది.
ఈ సినిమా విజయవంతంగా 10 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా.. ఈ 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ముఖ్యంగా 10వ రోజు ఈ సినిమా రూ. 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి రూ. 50 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ వీకెండ్ లో పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో ‘కోర్ట్’ (Court) కి భారీగా కలెక్షన్స్ పెరిగాయి. అయితే కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇక్కడే కాకుండా ఓవర్సీస్లోనూ దుమ్మురేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుండడం విశేషం. తాజాగా ఈ మూవీ యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ మార్క్ కి చేరువలో ఉంది. కాగా, కోర్ట్ మూవీకి ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయని సమాచారం.

