‘మ్యాడ్ స్క్వేర్’ సెన్సార్‌ పూర్తి.. రన్‌ టైమ్‌ ఎంతంటే.?

by | Mar 24, 2025 | సినిమా

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. సూప‌ర్ హిట్ చిత్రం మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వ‌స్తుంది. డెబ్యూ యాక్టర్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కాగా, కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ పార్టులో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే వచ్చిన సాంగ్స్, టీజర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మ్యాడ్‌ మూవీ మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

మ్యాడ్ స్క్వేర్‌ (Mad Square) మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ విషయానికొస్తే.. కేవలం 2 గంటల 7 నిమిషాల రన్‌ టైం మాత్రమే ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇది చూస్తుంటే ప్రేక్షకులకు విసుగు రాకుండా ఉండేందుకు మరీ ఎక్కువ రన్‌ టైం లేకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. ఈ మూవీ స్టోరీని పరిశీలిస్తే.. లడ్డుగాని పెళ్లికి వ‌చ్చిన ఫ్రెండ్స్ గ్యాంగ్ బ్యాచిల‌ర్ పార్టీ కోసం గోవాకి వెళ్లగా కథ అక్కడ మలుపు తిరుగుతుందనే స్టోరీ లైన్ తో మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణులు మ్యాడ్ మూవీని మించేలా ‘మ్యాడ్ స్క్వేర్’లో (Mad Square) కామెడీ పండించబోతున్నారని తెలుస్తోంది.

https://twitter.com/SitharaEnts/status/1904083944934621328