నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విజయవంతంగా మొదటి వారం థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న కోర్టు (Court) సినిమా విడుదలైన 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 42.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ముఖ్యంగా 8వ రోజు ఈ సినిమా రూ.2.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఈ రేంజులో కలెక్షన్స్ రావడంపై చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ఇక్కడే కాకుండా ఓవర్సీస్లోనూ అదరగొడుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుండడం విశేషం.
తాజాగా ఈ మూవీ యూఎస్ లో 9 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసింది. ప్రతీ రోజు కూడా దాదాపు లక్ష డాలర్స్ మేర ఈ చిత్రం సాధించడం విశేషం. ఈ వీకెండ్ ముగిసే నాటికి యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ కి పైగా కలెక్షన్స్ అలాగే ఇక్కడ రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ఈ మూవీ సాధించే అవకాశముంది. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేకపోవడంతో పాటుగా వీకెండ్ కూడా కలిసి రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
కాగా, కోర్ట్ (Court) మూవీకి ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. కాగా, ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.

