టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమకు ఆయన అందిస్తున్న విశేష సేవలను గానూ యూకే పార్లమెంట్ చిరుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని (Lifetime Achievement Award) ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. సినీ రంగంలో నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి అందిస్తున్న సేవలకు ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంటులో ఈ అవార్డును చిరంజీవికి అందజేయనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే యూకే ప్రభుత్వం ప్రకటించిన ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకునేందుకు చిరంజీవి లండన్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే హీత్రూ విమానాశ్రయానికి చేరుకోగా.. అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న ప్రవాస భారతీయులు, సినీ ప్రేమికులు ఘనంగా స్వాగతం పలికారు.
బ్రిటన్ పార్లమెంటు భవనమైన హౌస్ ఆఫ్ కామన్స్‌లో చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 19వ తేదీ బుధవారం నాడు చిరంజీవికి ఈ గౌరవాన్ని అందజేయనున్నారు. అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని (Chiranjeevi ) సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ తో పాటుగా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అలాగే ఈ వేడుకలో యూకే ప్రభుత్వ ప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. దింతో చిరుకు శుభాకాంక్షలు చెబుతూ పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు చిరుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక చిరంజీవి (Chiranjeevi) నటుడు గానే కాకుండా రాజకీయ నాయకుడుగా, సామాజిక సేవకుడుగా విశేష సేవలందించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల నట ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు హిందీ ఇతర దక్షిణాది చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు. ఇక సినిమాల విషయనికొస్తే.. చిరంజీవి కథానాయకుడిగా యువ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండేది. కానీ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

