బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా (Rashmika Mandana) పోషించారు. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. నెల రోజులైనా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.770 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దింతో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటుగా విక్కీ కౌశల్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. మార్చి 7న ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ అవగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది.
అలాగే ‘ఛావా’ (Chava) మూవీ ఆన్ లైన్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో సైతం అరుదైన రికార్డు సాధించింది. ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 12 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవగా.. ఈ ఘనత సాధించిన తొలి హిందీ చిత్రంగా ఛావా రికార్డును ఖాతాలో వేసుకుంది. అలాగే ‘ఛావా’ ఐదో వీకెండ్ లో రూ. 22 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ‘స్త్రీ2’, ‘పుష్ప2’ (Pushpa) రికార్డులను బద్దలుకొట్టింది. ఇక విడుదలైన 22 రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి హిందీ సినిమాగా ‘ఛావా’ సెన్సేషనల్ రికార్డు సాధించింది. హిందీలో రెండో వారంలోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా కూడా ఛావా ఘనత సాధించింది. ఈ సినిమా సౌత్, నార్త్ అనే తేడా లేకుండా విడుదలైన ప్రతీ చోట భారీ కలెక్షన్స్ తో రికార్డులు తిరగరాసింది. ఈ మూవీ హిందీలో విడుదలైన నాలుగు వారాల్లో రూ. 524.83 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. హిందీలో రూ.511 కోట్ల వసూళ్లు అందుకున్న ‘బాహుబలి 2’ సినిమాను కూడా బ్రేక్ చేసింది.

