మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగెన్'(Dragon) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో హీరో ఎన్టీఆర్ (NTR) ఇంకా అడుగుపెట్టని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి పాల్గొననున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ క్రమంలోనే స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు వెళ్లనుంది. అక్కడి లొకేషన్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నారు. అలాగే ఓ భారీ రిస్కీ ఫైట్ ను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీలంక షెడ్యూల్లో హీరో ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ (NTR) ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.


