నేచురల్ స్టార్ నాని (Nani)నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. చిన్న సినిమాగా మొదలై పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ క్రమంలోనే విడుదలై రెండు వారాలు గడిచినా వసూళ్ల సునామీ మాత్రం తగ్గట్లేదు. పెద్దగా కమర్షియల్ అంశాల్లేకుండా కంటెంట్ కి కట్టుబడి తీసిన ఈ చిత్రం చిత్ర నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను తీసుకొస్తోంది.
ఈ సినిమా విజయవంతంగా 17 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా.. ఈ 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ వీకెండ్ లో పలు పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ ‘కోర్ట్’ (Court) మూవీ మాత్రం తన జోరు కొనసాగిస్తూనే ఉంది. అయితే కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇక్కడే కాకుండా ఓవర్సీస్లోనూ సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుండడం విశేషం. కాగా, మరి కొద్ది రోజులలో ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. ‘కోర్ట్’ మూవీ డిజిటల్ రైట్స్ ను దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’ (Netflix) రూ.9 కోట్లకు సొంతం చేసుకోగా.. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

