యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగెన్’ (Dragon) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ఇప్పటికే మొదలైంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇంకా షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టలేదు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయే తదుపరి షెడ్యూల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ముగిశాక ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న ‘వార్-2’ మూవీ చిత్రీకరణలో పాల్గొననున్నాడట. ‘వార్-2’లో ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో ఓ సాంగ్ తో పాటుగా, కీలక సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయట. దాంతో వార్-2 మూవీ షూటింగ్ మొత్తం ముగిశాక మళ్లీ ఎన్టీఆర్ (NTR) ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లో చెరతారట. అప్పటి నుంచి అన్ని డేట్స్ ఈ సినిమాకే కేటాయించి సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని యంగ్ టైగర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటి వరకూ పోషించని పాత్రలో కనిపించబోతున్నాడని.. ఆయన పాత్రను ప్రశాంత్ నీల్ రూపొందించిన తీరు అత్యంత శక్తివంతంగా ఉండనుందని చిత్ర యూనిట్ పేర్కొంటున్నారు. కాగా, పక్కా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం.
మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వరుస షెడ్యూళ్లలో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు.

