విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ కోసం మంచు విష్ణు భారీ రిస్క్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం కన్నప్ప ఓటీటీ డీల్ ఇంకా పూర్తవలేదని తెలుస్తోంది. దాదాపు వంద కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఓటీటీ డీల్ ఇంకా ఫైనల్ అవకపోవడం అభిమానుల్ని షాక్ కు గురిచేస్తోంది. నిజానికి ఎక్కువ బడ్జెట్ సినిమాల ఓటీటీ డీల్స్ ముందే పూర్తవుతున్నాయి. దాంతో సినిమా కోసం పెట్టిన బడ్జెట్ లో సగభాగం ఇలా వస్తుంది అని మేకర్స్ భావిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే ‘కన్నప్ప’ మూవీ ఓటీటీ డీల్స్ కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థలు నిర్మాతలను సంప్రదించగా మంచు విష్ణు అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. సినిమా విడుదలకు ముందు ఓటీటీ ఒప్పందం చేసుకుంటే వారు ఇచ్చినంత మాత్రమే తీసుకోవాలి. కానీ సినిమా విడుదలై హిట్ టాక్ వచ్చాక ఓటీటీ డీల్ చేస్తే భారీ స్థాయిలో డిమాండ్ చేయొచ్చు అని మంచు విష్ణు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందులో హీరోయిన్ గా ‘ఓం భీమ్ బుష్’ ఫేమ్ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీ దేవిగా అలరించబోతున్నారు. అలానే మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్ , బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ సినిమాలో రుద్ర పాత్రను పోషించారు. పలు ఇండస్ట్రీలకు చెందిన యాక్టర్స్ ఈ మూవీలో నటిస్తుండటంతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, వీడియో గ్లింప్స్, వీడియో లిరికల్ సాంగ్ ఇటీవల విడుదలవగా.. అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కాగా, పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు.

