తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మల్టీస్టారర్స్ మళ్ళీ మొదలవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు యువ నటులు మల్టీ స్టారర్ సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అల్లరి నరేష్ (Allari Naresh) , నారా రోహిత్ (Nara Rohith) ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో అధికారికంగా ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లరి నరేష్ వరస సినిమాలతో బిజీగా వున్నారు, అలాగే నారా రోహిత్ కూడా ఇటీవల బిజీ అయిపోయారు. అయినా కూడా ఈ ఇద్దరికీ ఒక కథ నచ్చడంతో ఇద్దరూ కలిసి సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. నారా రోహిత్ తో కలిసి ‘సుందరకాండ’ (Sundarakanda) లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తీసిన వెంకటేష్ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi) ఈ మల్టీ స్టారర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని మైరా క్రియేషన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఇద్దరు హీరోలకు కథను చెప్పారని, వారిద్దరూ అంగీకారం తెలిపారని అంటున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, అల్లరి నరేష్ విషయానికొస్తే.. ‘అల్లరి’తోనే నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆపై నాంది, ఉగ్రం, మారేడుమిల్లి ప్రజానీకం వంటి విభిన్న చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక నారా రోహిత్ విషయానికొస్తే.. కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఏదేమైనా అల్లరి నరేష్ (Allari Naresh) , నారా రోహిత్ (Nara Rohith) కాంబినేషన్ లో సినిమా వస్తే కనుక ఇది వీరిద్దరి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

