మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘మనశంకర వరప్రసాద్‌గారు’. నయనతార (Nayanathara) కథానాయికగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ కీలక పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, కేవలం తెలుగులోనే ఇంత భారీ స్థాయిలో విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మూవీ నిలిచింది. ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమా సాధించని రీతిలో కేవలం పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం విశేషం.
ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవికి పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (Pawan Kalyan Creative Works) సంస్థ ప్రత్యేక అభినందనలు తెలిపింది. “నాలుగు దశాబ్దాలకుపైగా మెగాస్టార్ చిరంజీవి గారు తాండన తన నటన, కామెడీ, తనదైన నటన, కామెడీ, డ్యాన్స్ తో అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నారు. ఇప్పటికీ అదే గ్రేస్ తో అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఆయన కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేక మైల్ స్టోన్ గా నిలిచింది. ముఖ్యంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేశ్ (Venkatesh)ను వెండితెరపై చూపించిన విధానం ఎంతగానో అలరించింది. దర్శకుడికి నా ప్రత్యేక అభినందనలు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందించిన సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇంత మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి, సుస్మిత కొణిదెలకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న హీరోయిన్ నయనతారకు ప్రత్యేక శుభాకాంక్షలు’ అని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కాగా, ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి(Sahu Garapati) , సుస్మిత కొణిదెల (Sushmitha Konidela) సంయుక్తంగా నిర్మించారు.

