తెలుగు చిత్ర పరిశ్రమలో ‘బలగం’ వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు వేణు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) కాంబోలో ‘ఎల్లమ్మ’ (Yellamma) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు (Dil Raju) ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమాతో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం కాబోతుండటం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇందులో దేవిశ్రీప్రసాద్ ‘పర్శి’ అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా, దైవ శక్తి, స్థానిక సంప్రదాయాలు కలయికగా ‘ఎల్లమ్మ’ మూవీ తెరకెక్కనుండగా.. ఈ సినిమాపై మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథనం ‘ఎల్లమ్మ’ దేవత చుట్టూనే తిరిగేలా ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ‘ఎల్లమ్మ’ దేవత పాత్ర పోషించేందుకు అగ్ర కథానాయిక కీర్తి సురేష్ (Keerthy Suresh) ను సంప్రదించారట మేకర్స్. దర్శకుడు వేణు చెప్పిన కథ కీర్తి సురేష్ కు కూడా బాగా నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాంతో ఈ సినిమాలో ‘ఎల్లమ్మ’ దేవతగా కీర్తి సురేష్ నటించనుండగా.. ఆమె భక్తుడి పాత్రలో దేవిశ్రీప్రసాద్ (DSP) కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్ .

