సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథనాయకుడిగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ ‘వారణాసి (Varanasi). భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకచోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ దేశవ్యాప్తంగా విశేష స్పందనను తెచ్చుకుంది.
కాగా, ‘వారణాసి’ సినిమా గురించి వస్తున్న ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుండగా.. 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ‘వారణాసి’ విడుదల తేదీని కూడా చిత్ర యూనిట్ నిర్ణయించారని తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్‌ను ఈ ఏడాది శ్రీరామనవమి సందర్భంగా అంటే మార్చి 26న అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ‘వారణాసి’ (Varanasi) మూవీలో రుద్ర అనే పాత్రలో మహేష్ బాబు నటిస్తుండగా.. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

